6. జయ గంగాధర హర ...

6. జయ గంగాధర హర ...

Audio Link
ఇది సముద్ర మథన సమయంలో హాలాహలం పుట్టినప్పుడు దాన్ని సేవించి, లోకాలను రక్షించమని దేవతలు ఈశ్వరుని చేసిన స్తుతి.

గంగాధర ! హర ! గిరిజారమణా ! నీకు జయమగుగాక ! కృపతో నీవు నన్ను రక్షించు ప్రభో శివ ! కైలాస శిఖరం మీద గహనమైన కల్పవృక్ష వనంలో తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. కోకిలలు కుహూరవాలు చేస్తున్నాయి, హంసలు ఎంతో సంతోషం తో నృత్యం చేస్తున్నాయి. అలాంటి లలితమైన ప్రదేశంలో మణులతో తయారు చేయబడిన ఒక మందిరముంది. ఆ మధ్యలో శివుని సమీపంలో గౌరీదేవి ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి గౌరీదేవితో కూడిన పరమశివ ! ఎంతోమంది అప్సర స్త్రీలు ఆనందంగా గానం చేస్తున్నారు, నర్తిస్తున్నారు. కిన్నర స్త్రీలు ఆనందంగా సప్తస్వరాలతో గానం చేస్తున్నారు. శివ ! ఓ మహాదేవ ! నీకు నమస్కారములు. గంధర్వులు తథిగిణతోమ్మని మృదంగం వాయిస్తున్నారు. ధింధింధిమ్మని, గానం చేస్తుంటే, నీవు క్వణనిక్వణములతో ఆనంద తాండవ నాట్యం చేస్తున్నావు. ఆ సమయంలో నీ కాలి నూపురములు ధ్వనిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. చక్రాల్లా నీ కాళ్ళను తిప్పుతుంటే, అందెలు కదులుతున్నాయి, నీవు డమరుకం వాయిస్తుంటే, నీ చేతివేళ్ళు ఆ శబ్దానికి తగ్గట్టుగా లాస్యం చేస్తున్నాయి. కర్పూర గౌరమైన వర్ణంతో ప్రకాశించే నీవు పంచముఖాలతోను, మూడు కన్నులతోను ప్రకాశించే నీవు, శశిధరుడవై, పాములను మెడలో ధరించి నర్తిస్తున్నావు. శివ !మమ్మల్ని రక్షించు. అందమైన నీ జటలు పవిత్రమైన గంగని ధరించగా, నీవు త్రిశూలమును, పినాకమును ధరించి, కపాలధారివయ్యున్నావు. శివ ! హర హర మహదేవ ! మమ్మల్ని రక్షించు. పన్నగములను యజ్ఞోపవీతంగా ధరించి , నీ వామ భాగంలో అత్యంత లలితముగా ఉన్న గౌరీదేవిని ధరించి ఉన్నావు. ఎంతో సౌందర్యవంతమైన నీ దేహానికి భస్మాన్ని అలదికొని వృషభధ్వజుడవయి మా తాపత్రయాలని పోగొట్టే దివ్య రూపంతో దర్శనమిస్తున్నావు. ఎంతో ఆనందకరంగా శంఖం పూరిస్తూ, చిరుతలు వాయిస్తూ. చతుర్ముఖ బ్రహ్మ వేద పారాయణ చేస్తూ నీకు నీరాజనమిస్తున్నాడు. నీ అత్యంత సుకుమారమైన పాదపద్మములను హృదయ కమలంపైన ధరించి ఈశ్వరునికి నమస్కరించి శివుని వైపే చూస్తున్నారు అందరూ.
ఆరతి ఇచ్చేటప్పుడు ధ్యానం చేస్తూ త్రిజటను రక్షించిన శ్రీరాముడు నిన్నే స్మరిస్తున్నాడు. ఎవరు ప్రతిరోజూ ఈ స్తోత్రం భక్తితో పఠిస్తారో, వింటారో వారు శివసాయుజ్యాన్ని పొందుతారు.
హర హర మహాదేవ శంభో శంకర !!



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...